Date : 01-09-2026
ఆకివీడు: పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, పక్కా డ్రైయినేజీ సౌకర్యం కల్పించేందుకు నగర పంచాయతీ నిధులు కేటాయిస్తూ తీర్మానం చేసినట్లు చైర్‌పర్సన్ జామి హేమావతి చెప్పారు. చైర్‌పర్సన్ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం స్థానిక నగర పంచాయతీ సమావేశ హాలులో సోమవారం జరిగింది. సమావేశంలో మంచి నీటి సమస్య, శానిటేషన్ పనివాళ్ల సమస్యలపై, వీధిలైట్లు ఏర్పాటు వంటి వాటిపై చర్చించారు. అనంతరం అజెండాకు వచ్చిన అంశాల్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశం జరుగుతుండగానే టీడీపీ, జనసేన కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు.
అజెండాకు వచ్చిన సర్వే నంబర్ 473లో 2.32 ఎకరాల భూమి ఆక్రమణలు తొలగించి, స్థలం చుట్టూ ఆక్రమణలు జరగకుండా డైమండ్ ఆకారంలో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టేందుకు టెండర్లను ఆమోదించారు. ఆ ప్రాంతంలో స్థలం లెవిలింగ్ అయ్యే అంచనా వ్యయాన్ని టెండర్లు పిలవగా ఒక శాతం తక్కువతో వేసిన టెండర్లను సమావేశం ఆమోదించింది.
పట్టణంలోని పలు మంచి నీటి ట్యాంకుల వద్ద నుంచి మంచి నీరు శుద్ధి చేసి సరఫరా చేయుటకు అవసరమయ్యే లిక్విడ్ క్లోరిన్ కొనుగోలుకు సమావేశం తీర్మానం ఆమోదించింది. ప్రస్తుతం సిద్ధాపురం రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలోని చెత్తను వేరే ప్రాంతంలో దిగుమతి చేయుటకు రూ.5 లక్షలతో పనులు చేపట్టేందుకు సమావేశం ఆమోదించింది.
స్థానిక అయిభీమవరంలో నగర పంచాయతీ స్వాధీనం చేసుకున్న 2.32 ఎకరాల భూమిలో 1.86 సెంట్లలోని ఎకరం భూమిలో నగర పంచాయతీ భవన నిర్మాణం, 86 సెంట్లలో వాలీబాల్ కోర్టు, షెటిల్ కోర్టు ఏర్పాటు చేసుకుని, లీజు దారులు వారి సొంత సొమ్ముతో అభివృద్ధి చేసుకునే విధంగా 3 ఏజెన్సీలకు ఇచ్చే విధంగా నగర పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సమావేశంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ పుప్పాల పండు, వైప్ పడాల శ్రీనివాస రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ జే. కృష్ణ మోహన్ పాల్గొన్నారు.












.jpg)




