Date: 26-DEC-2018
ఆకివీడు: తోకలేని పిట్టకు ఆకివీడు లో గూడు కరువైంది. మూడు దశాబ్దాలుగా ప్రైవేట్ గూడులో ఉంటున్న పోస్టాఫీసుకు సొంత భవనం నిర్మించేందుకు ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. స్ధానిక పంచాయతీ రోడ్డులో రెండో అంతస్థులో ప్రెవేట్ భవనం అద్దెకు ఉంటున్న పోస్టాఫీసుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సివస్తుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పోస్టాఫీసులో పనిచేసే సీనియర్ ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఆకివీడు వేణుగోపాలస్వామి ఆలయం ప్రక్కన పోస్టాఫీసు కోసం స్ధలం కొనుగోలు చేసి ఏళ్ల తరబడి వృధాగా ఉన్నప్పటికీ ఎవరూ సొంత భవనం నిర్మాణానికి ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పోస్టాఫీసు కార్యాలయం సొంత భవనం నిర్మాణానికి నిధులు కేంద్రం విడుదల చేయాలని అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. వచ్చే ఏడాది అయినా పోస్టాఫీసు సొంత భవనం ఏర్పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.