* నత్తనడకన వంతెన పనులు
* మూడేళ్లుగా పిల్లర్ల దశలోనే…
* పట్టించుకోని అధికారులు
ఆకివీడు:కొల్లేటి పెద్దింట్లమ్మ ఆలయానికి వెళ్లే వారధి నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఈ పనులను చేపట్టారు. సుమారు రూ.కోటి వ్యయంతో పెంచికలమర్రు వద్ద సర్కారు కాలువపై నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ పిల్లర్ల దశలోనే వంతెన ఉంది. ఇరవై ఏళ్ళ క్రితం వంతెన నిర్మాణ పనులు చేపట్టగా కాలువలో మట్టి పరీక్షలు నిర్వహించి, వంతెన నిర్మాణానికి పిల్లర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఒక పీల్లర్ నిర్మాణం తరువాత భూమి అనుకూలంగా లేదని వంతెన పనులు నిలుపుదల చేశారు. మళ్లీ అదే ప్రాంతంలో వేరే డిజైన్‌లో పిల్లర్లు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. సర్కారు కాలువపై వంతెన నిర్మాణ పనులతో పాటే అకివీడులోని ఉప్పుటేరుపై రైల్వే వంతెన నిర్మాణం చేపట్టారు. రైల్వే వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. పెద్దింట్లమ్మ వారధి పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. సంబందిత శాఖ అధికారులు పట్టించుకోవాలని స్థానికులు మరియు భక్తులు కోరుతున్నారు.
ఇనుప వంతెన దిక్కు....
కొల్లేటికోటలో వేంచేసియున్న పెద్దింట్లమ్మ జాతర మహోత్ఫవాలు వచ్చే నెల మార్చి 7 నుంచి జరుగుతున్నాయి. జాతరకు వెళ్లే భక్తులు సర్కార్ కాలువపై గతంలో నిర్మించిన ఇనుప వంతెనపై నుంచే వెళ్లాల్సిఉంది. ఆటోలు, కారులు, ద్విచక్ర వాహనాలు ఈ వంతెన గుండా వెళుతున్నాయి. ఉత్సవాలు ప్రారంభం సందర్బంగా వంతెనపై నడిచి వెళ్లేందుకు, ద్విచక్ర వాహనాలకు మాత్రమే అవకాశం కల్పిస్తారని తెలిసింది.