Date: 18-08-2022
ఆకివీడు :నాడు - నేడు పథకంలో పాఠశాలల రెండో విడత పనులను జిల్లా లో 740 పాఠశాలల్లో రూ. 484 కోట్ల వ్యయంతో చేపట్టినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర, ప్రాథమికొన్నత పాఠశాలను, సచివాలయాన్ని బుధవారం ఆకస్మిక తనిఖీ చేసారు. ఆయా పాఠశాలలో పనులను వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. జెడ్పి ఉన్నత పాఠశాల ఆవరణంలో వర్షం నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే మురుగు నీరు పారుదలకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సి .హెచ్. వెంకటేశ్వరరావు ఆదేశించారు. పాఠశాల నిర్మాణంలో బరువు ఇటుకలతో నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమతిలేని ఇటుకల్ని అధిక ధరకు ఎవరు కొనుగోలు చేయమన్నారని ప్రశ్నించారు. సచివాలయం సిబ్బంది నగర పంచాయతీ కమిషనర్ అధీనంలో పనిచెయ్యాలని సూచించారు. నగర పంచాయతీలోని సమస్యలను చైర్ పర్సన్ జామి హైమావతి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నగర పంచాయతీ సిబ్బంది కొరత, సచివాలయం సిబ్బంది పనితీరు మెరుగు పరచాలని విజ్ఞప్తి చేసారు. పట్టణంలో ఐదు సచివాలయాలు ఉన్నాయని వాటికీ భవనాలు నిర్మించడానికి స్థలాలు సిద్ధంగా ఉన్నాయని, నిధులు మంజూరుకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
9 ఎకరాల చెరువుపై తక్షణ నివేదిక ఇవ్వాలి
పట్టణంలో పురాతనమైన చెరువుల్లో 9 ఎకరాల చెరువు ఎక్కడ ఉంది, సర్వే నెంబర్, దాని పొజిషన్ వంటివాటిపై పరిశీలన చేయాలన్నారు. సర్వే చేసి సర్వే నెంబర్ సహా వారి వివరాలను తక్షణం అందజేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి తహసీల్దార్ ఎన్. గురుమూర్తి రెడ్డిని ఆదేశించారు. 9 ఎకరాల రెవెన్యూ రికార్డ్స్ సేకరించాలన్నారు. అటువంటి భూమిని ప్రభుత్వ అవసరాలకు, ప్రజా అవసరాలకు వినియోగించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ చెప్పారు.
డంపింగ్ యార్డ్ కు స్థలం సేకరించండి
పట్టణంలో డంపింగ్ యార్డ్ కు స్థలం సేకరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి కమిషనర్ సి.హెచ్.వెంకటేశ్వరరావు ఆదేశించారు. డంపింగ్ యార్డుతో మురుగు కాల్వ, రోడ్లు పూడుకుపోతున్నాయని పిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. చెత్త వేసేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలం సేకరించాలని ఆమె సూచించారు. డ్రైయిన్ మీద వేసే చెత్త నిలుపుదల చెయ్యాలని ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలి
పట్టణంలోని జాతీయ రహదారిపై ట్రాఫిక్ అధికంగా ఉంటుందని పిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ విలేకరులకు వివరించారు. డ్రైయిన్ల వెలుపల భాగంలో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్ కి సూచించామన్నారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ చెప్పారు.