Date: 24-08-2022
ఆకివీడు : హైవే - 165 విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పామర్రు నుంచి దిగమర్రు వరకు రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిధులు మంజూరు చేసింది. టెండర్ల దశ కూడా పూర్తియ్యింది. పామర్రు నుంచి ఆకివీడు వరకు ఒక ప్రాజెక్టు, ఆకివీడు నుండి దిగమర్రు వరకు రెండో ప్రాజెక్టు కింద పనులు చేపట్టేందుకు మొత్తం రూ.1,275 కోట్లు కేటాయించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పలు చోట్ల బైపాస్ రోడ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టగా ఆయా ప్రాంతాల్లోని రైతులు కోర్టుకు వెళ్లడంతో ఆకివీడు - దిగమర్రు ప్రాంతాల్లో పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం పామర్రు - ఆకివీడు మధ్య పనుల్ని వేగవంతం చేసారు. ఈ ప్రాంతాల్లో డబల్ లైన్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 275 కోట్ల వ్యయంతో 64 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించారు. గుడివాడ, కైకలూరు, పల్లెవాడ, ఆకివీడు ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. స్థల సేకరణ పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. గుడివాడ వద్ద రెండు వంతెనలు, ముదినేపల్లి వద్ద ఒక వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. 20 మైనర్ వంతెనలు, 96 పైప్ కల్వర్టులు పనులు వేగంగా జరుగుతున్నాయి. గుడివాడ, పల్లెవాడ లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ శరవేగంగా జరుగుతుంది.
ఆకివీడు వద్ద ఉప్పుటేరు పై భారీ వంతెన నిర్మాణం
ఆకివీడు వద్ద ఉప్పుటేరు పై భారీ వంతెన నిర్మించనున్నారు. ఆలపాడు మీదుగా సోమేశ్వరం నుంచి అయి భీమవరం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారికి ఉప్పుటేరుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. గత ఏడాది ఉప్పుటేరులో వంతెన నిర్మాణానికి మట్టి సేకరణ చేసి పరీక్షలు నిర్వహించారు. సాయిల్ టెస్ట్ అనుకూలంగా రావడంతో నిర్మాణానికి అనువైన ప్రదేశంగా గుర్తిచారు. ఉప్పుటేరు మధ్య భాగం వరకు రెండు వైపులా మట్టి పూడ్చి వంతెనకు అవసరమయ్యే పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం మట్టి పూడిక పనులు కొనసాగుతున్నాయి. వచ్చే వేసవి లో బోర్లు తీసి వంతెన పనులు ప్రారంభిస్తారు.
పనులు వేగవంతం చేసాం
పామర్రు - ఆకివీడు మధ్య జాతీయ రహదారి 165 పనులు వేగవంతం చేసాం. ప్రస్తుతం పలు చోట్ల కల్వర్టులు, వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.275 కోట్ల ప్యాకేజీ నిధులు కేటాయించారు. నాలుగు బైపాస్ రోడ్లు, నాలుగు వంతెనల నిర్మాణం చేపడతాం.
యం. సత్యనారాయణ , డీఈ, జాతీయ రహదారుల విభాగం
స్థల సేకరణపై కోర్టులో స్టే
ఆకివీడు - దిగమర్రు మధ్య జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడింది. రూ.1000 వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి స్థల సేకరణ పనులు ప్రారంభించారు. ఉండి, భీమవరం, వీరవాసరం, బల్లిపాడు, దగ్గులూరు, ప్రాంతాలలో 40 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయి.