ఆకివీడు టౌన్ : అత్త తన కోడలిని మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసిన ఘటన శుక్రవారం ఆకివీడులో జరిగింది. స్థానికులు, పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఒక బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్న అత్త తన కోడలిని శుక్రవారం ఉదయం దూషిస్తూ మొదటి అంతస్తు నుంచి కిందకు నెట్టేసింది. కోడలు కింద విద్యుత్తు మోటారు పైకప్పుగా ఏర్పాటు చేసిన రేకుపై పడి దొర్లుకుంటూ నేలపై పడిపోయింది. గాయాలైన ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తలలో రక్తం గడ్డ కట్టిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. భర్త తమిళనాడులో ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్, వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు, అపార్ట్మెంట్ వద్ద స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.