ఆకివీడు టౌన్ మరియు రూరల్ : రైల్వే గేట్ల ప్రమేయం లేకుండా ఆర్ ఓబీ, ఆర్ యూబీలకే ప్రాధాన్యమిస్తున్నామని విజయవాడ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. ఆకివీడు స్టేషన్ సమీపంలోని దుంపగడప గేటు, సిద్ధాపురం గేటులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దుంపగడప గ్రామంలోని గేటు వద్ద, గుమ్ములూరు వెళ్లే రోడ్డులోని గేటు వద్ద ఆర్ ఓబీలు, రైల్వేస్టేషన్ ఇరువైపులా ఉన్న గేట్ల స్థానంలో అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు అవకాశం ఉందన్నారు. అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25 కోట్లు, ఆర్ఓబీకి రూ. 70 కోట్లు వ్యయమవుతుందన్నారు. నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ గేదల అప్పారావు మాట్లాడుతూ ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణాలకు గతంలోనే నగర పంచాయతీ తీర్మానం చేసిందని, అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. గేట్ల పరిశీలిస్తున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, ఆర్అండ్ బీ డీఈ సీహెచ్ వీఎస్ ప్రసాద్, జేఈ శ్రీహరి, ఆర్ఐ ఆంజనేయులు వైఎస్సార్సీపీ నేత బొక్కా శ్రీ నివాసరావు తదితరులు ఉన్నారు.