ఆకివీడు టౌన్: ఆకివీడులో మంగళవారం రాత్రి జరిగిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలలో జనసేన, తెదేపా కార్యకర్తలు, అభిమానుల మధ్య వాగ్వాదం చెలరేగింది. విమర్శలు గుప్పిస్తున్నారంటూ ఇరుపార్టీల కార్యకర్తలు, అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ చెలరేగడంతో జనసేన పార్టీ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పలువురు జనసైనికులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. జనసేన ఉండి నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగ నాగరాజు, తెదేపా ఆకివీడు మండల అధ్యక్షుడు రామవరప్రసాద్ కార్యకర్తలను నిలువరించారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను సముదాయించే యత్నం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. రాత్రి 8.30 గంటలకు ప్రారంభమైన ఈ ఘర్షణ వాతావరణం రాత్రి 10.30 వరకు కొనసాగింది.