Date : 03-09-2025
ఆకివీడు టౌన్: సైబర్ మోసం కేసులో ఆకివీడుకు చెందిన విశ్రాంతి ప్రధానోపాధ్యాయురాలు కాకర్ల రాజరాజేశ్వరి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.93.50 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వాట్సప్‌లో రాజేశ్వరికి ఫోన్ చేసిన నేరగాడు తాను సైబర్ క్రైమ్ అధికారినని, ఆమెపై సుప్రీం కోర్టులో కేసు నమోదైందని చెప్పాడు. మీ ఆధార్ కార్డు, సిమ్ కార్డులు మా వద్ద ఉన్నాయని, మీ అకౌంట్లో డబ్బు ఆదాయానికి మించి ఉందని, కోర్టు మిమ్మల్ని అరెస్టు చేయమని చెప్పిందంటూ బెదిరించాడు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే అకౌంట్లో సొమ్ము జమ చేయాలని ఆదేశించాడు. ఆమె భయపడి విడతలుగా సొమ్మును సైబర్ నేరగాడి అకౌంట్కు జమ చేశారు. జూన్ 15 నుంచి 10 విడతలుగా రూ.93 లక్షలు జమ చేశారు. ముందు రూ.60 లక్షలకు పైగా సొమ్మును జమ చేయించుకున్న అతను మళ్లీ ఆమెకు ఫోన్ చేసి మీ బ్యాంక్ ఖాతాలన్నీ సక్రమంగా ఉన్నాయని, మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తానని, మరో 33 లక్షలు చెల్లిస్తే మొత్తం సొమ్ము మీ ఖాతాలో జమ చేస్తానని చెప్పాడు. ఆమె నమ్మి ఆ సొమ్మును కూడా జమ చేశారు. ఆ తరువాత నుండి అతని నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు.